విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆమె మరణంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గుండె పోటుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి మరణించారు. ఆమె మరణం కుటుంబాన్ని అనుకోను సునామీలా కమ్మేసిందని, నిన్న కూడా కోలుకుంటుందన్న నమ్మకంగా ఉన్నామని, ఒక్కసారిగా గాయత్రి మరణించిందన్న వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.
‘‘ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కుమార్తె మరణం దిగ్బ్రాంతి కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబీలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పుత్రికావియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్ర ప్రసాద్‌కు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’’ అని పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు.
‘‘నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ అని జూనియర్ ఎన్‌టీఆర్(Jr NTR) ఎక్స్(ట్వీట్) చేశారు.