ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలో ఒక స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రోహిత్ బాల్(Rohit Bal). తన వినూత్న డిజైన్స్‌తో ఈ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారాయన. రోహిత్ బాల్ అంటే ఒక బ్రాండ్‌లా మారింది. ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్న రోహిత్ బాల్ మరణాన్ని ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్(FDCI) ధ్రువీకరించింది. అంతేకాకుండా ఆయన మరణానికి సంతాపం తెలిపింది. ఈ సందర్బంగా ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(FDCI) వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రోహిత్.. ఫ్యాషన్ రంగానికి చేసిన వివేష సేవను, కృషిని FDCI గుర్తు చేసుకుంది.
నవంబర్ 2023లో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేరి చికిత్స పొందారు రోహిత్ బాల్. రెండు వారాల క్రితం ఆయన ముంబైలో జరిగిన లక్మే ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తన చివరి ప్రదర్శన చేశారు. 1986లో తన సోదరుడు రాజీవ్ బాల్‌తో కలిసి తన కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్(Rohit Bal).. అనతి కాలంలోనే దేశంలోనే ప్రముఖ డిజైనర్‌గా ఎదిగారు. ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్ర చూపారు. తమ పనికి గాను ఎన్నో అవార్డులు అందుకున్నారు.