కోలీవుడ్(Kollywood)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్(Delhi Ganesh) ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటికి చికిత్స కూడా తీసుకుంటున్నారు. 80ఏళ్ల ఈ నటుడు ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ వార్తపై తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు ఆయనకు సంతాపాలు తెలుపుతున్నారు. ఆయన ఇప్పటి వరకు 400కుపైగా సినిమాల్లో నటించి కోలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా పేరొందారు. కే బాలచందర్(K Balachander).. గణేష్‌ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయననే ఢిల్లీ గణేష్ అని కూడా పేరుపెట్టారు. ఎక్కువ సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కనిపించారు. అందులో కూడా వైవిద్యమైన పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన.
1 ఆగస్టు 1944న తమిళనాడులోని తిరునెల్వెలి(Tirunelveli)లో ఆయన జన్మించారు. కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 1964 నుంచి 1974 వరకు ఆయన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలు అందించారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో నటనా రంగంవైపు అడుగులు వేశారు. 1981లో వచ్చిన ‘ఎంగమ్మ మహారాణి’ సినిమాలో హీరోగా నటించిన ఢిల్లీ గణేష్(Delhi Ganesh) ఆ తర్వాత నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కొనసాగారు. ఎన్నో సినిమాల్లో తన నటనకు ఎన్నో అవార్డులు అందుకున్నారాయన. తాజాగా ఆయన ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా నటించారాయన.