టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ లలో ఒకరు కాజల్ అగర్వాల్. గతేడాది ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను ఆచి..తూచి చేస్తుంది. ఇక తాజాగా ప్రెగ్నెన్సీ రావడంతో… పూర్తిగా సినిమాల నుంచి తప్పుకుంది హీరోయిన్ కాజల్. ఇక త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది;
ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు అలాగే స్నేహితుల మధ్య కాజల్ అగర్వాల్ ఆదివారం సీమంతం వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాజల్ అగర్వాల్ సింధూరం రంగు చీరలో అందంగా ముస్తాబై.. ఆమె భర్త కుర్తా పైజామా ధరించి.. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు.కాజల్… గౌతమ్ తో కలిసి ఫోజులు ఇచ్చిన మధురమైన చిత్రాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా కొత్త సంవత్సరం 2022 నాడే తాను గర్భం దాల్చినట్లు కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
2007లో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. చందమామ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 2009లో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ హిట్ సాధించడంతో.. ఒక్కసారిగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది కాజల్. ఆ తర్వాత ఆమె నటించిన ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.