టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హనుమాన్ మాలాధారణలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి(Kondagattu Anjaneya Swamy) ఆలయాన్ని సందర్శించారు. వరుణ్ తేజ్ కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన… ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వరుణ్ తేజ్ కి ప్రసాదాలు, ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ… అత్యంత శక్తిమంతుడైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
మెగా ఫ్యామిలీ ఆంజనేయస్వామి భక్తులని వారి అభిమానులు అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఏపీ డిప్యూటీ సీఎం, వరుణ్ తేజ్(Varun Tej) బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తన వారాహి యాత్ర ప్రారంభించే ముందు వాహనాన్ని కొండగట్టుకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, ముడుపులు కట్టారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మరోసారి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.