కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది. రీల్ హీరోగానే కాకుండా ఎనో సేవ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు పునీత్. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు పునీత్. 45 ఫ్రీ స్కూల్స్ , 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్. అంతే కాదు చనిపోయిన తర్వాత కూడా ఒకరికి కంటి వెలుగు అయ్యారు పునీత్. ఆయన తన రెండు కళ్ళను దానం చేశారు. అదే విధంగా తమిళ్ హీరో విశాల్ కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాలతో పాటు రైతులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ..వారిని ఆదుకుంటున్నాడు విశాల్. తాజాగా విశాల్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
తన స్నేహితుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్. ఇటీవల ఆయన నటించిన ఎనిమి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన విశాల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇప్పటికే విశాల్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. అంతే కాదు తనకు సంబంధించిన ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని కోరుతూ ఉంటారు విశాల్. ఇక ఇప్పుడు ఇలా పునీత్ బాధ్యతను తన భుజాలపై వేసుకొని మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు విశాల్.