CM Relief Funds | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరమంతా వరద నీట మునిగిపోయింది. మూడురోజులుగా అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదనపు కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు కూడా విజయవాడ చేరుకున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలోని ముగ్గురు హీరోలు తమ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించారు. జూనియర్ ఎన్‌టీఆర్, సిద్దూ జొన్నల గడ్డ, విశ్వక్‌సేన్ తమ వంతు సహాయం అందించనున్నట్లు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.
“రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం న నియంతగాను కలచివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరొక రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు ఎన్‌టీఆర్.
“తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తోంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి సమయాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యవసరం. వరద బాధితులకు నా వంతు సహకారంగా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (రూ.15 లక్షలు ఆంధ్ర ప్రదేశ్ కి + రూ.15 లక్షలు తెలంగాణకి) వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాను. ఇది కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ సిద్దూ జొన్నలగడ్డ ప్రకటించాడు.
“ఈ విపత్తు సమయంలో, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి(CM Relief Funds) రూ. 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి రూ. 5 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు” అని విశ్వక్‌సేన్ ట్వీట్ చేశారు.