తన సినీ కెరీర్‌పై బాలీవుడ్ కా బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఒకానొక సమయంలో తాను ఏం చేయాలో అర్థం కాక.. బాత్రూమ్‌లో కూర్చుని ఏడ్చానని చెప్పాడు షారుఖ్. డబ్బులే కాదు విజయాలు కూడా ఎవరికీ ఊరికే రావని చెప్పాడు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో తొలుత ఎవరికైనా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. కానీ చాలా మంది అక్కడే ఆగిపోయే నిరుత్సాహంతో వెనుదిరుగుతారు. కొందరు మాత్రం తప్పు ఎక్కడ జరుగుతుందో గుర్తించి దాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగుతారని షారుఖ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు తానేమీ మినహాయింపు కాదనిచెప్పాడు. కెరీర్ ప్రారంభ సమయంలో చాలా సార్లు బాత్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చానని చెప్పాడు. దుబాయ్‌లో నిర్వహించిన ఓ సమ్మిట్‌లో ఈ విషయాలను షారుఖ్ పంచుకున్నాడు. నటన రంగంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘‘టార్గెట్‌ను చేరుకునేటప్పుడు ఊహించనిది జరిగితే కుంగిపోవద్దు. అలాంటి సమయాలు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, మళ్ళీ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లండి. ఒకానొక సమయంలో నా సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో బాత్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేవాడిని. ఆ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడేవాడిని. ఆ బాధ నుంచి నాకు నేను బయటపడ్డాను. ప్రపంచం మనకు వ్యతిరేకం కాదు. ఎవరి కుట్ర వల్లో నా సినిమా ఆడకపోవడం జరగలేదు. నేను ప్రేక్షకులతో కనెక్ట్ కాలేకపోయాను. అది నా తప్పే అని గ్రహించా ఆ తర్వాత విజయాలు అందుకోగలిగాను. ఎప్పుడూ కూడా నాకే ఇలా ఎందుకు జరుగుతుందని అనుకోవద్దు. ఎప్పుడూ కూడా అనుకున్నది సాధించి జీవితాన్ని ఆస్వాదించండి’’ అని షారుఖ్(Shah Rukh Khan) చెప్పాడు.