ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వల్లే ‘లైగర్’ తీసా..పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0
108

డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న మూవీ లైగర్. అనన్య పాండే కథానాయికగా..నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక రేపు ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా లైగర్ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్..పూరి జగన్నాథ్ ను ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.

“ఇంటర్వ్యూ చేయాలంటే కాస్త కంగారుగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ‘బద్రి’ తర్వాత నేను మీ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ట్రై చేశా. మా బంధువు సాయంతో మొదటిసారి మిమ్మల్ని కలిశా. ‘కథ ఏమైనా ఉంటే చెప్పు’ అని మీరు అడిగారు. మీతో నా మొదటి మీటింగ్‌ అదే. ఈరోజు మీతో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది”

మీరు దర్శకత్వం వహించిన ‘ఇడియట్‌’ రిలీజైనప్పుడు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పరిశ్రమలోనే ఉన్నా. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఆ సినిమా చూడటం ఓ మంచి అనుభూతిని అందించింది. ఆ సినిమా రిలీజైనప్పుడు మా ఏడీ బ్యాచ్‌ మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ సినిమాతో ప్రేమలో కొత్త ఫార్ములాని మీరు పరిచయం చేశారు. ప్రతి సీన్‌లో ఓ డైలాగ్‌ రాశారు” అని సుకుమార్​ చిట్​చాట్​ ప్రారంభించారు.

లైగర్‌’ ఆలోచన ఎలా మొదలైంది అని సుకుమార్ అడగగా దానికి పూరి సమాధానం ఇస్తూ..పదేళ్ల క్రితం ‘ఇద్దరమ్మాయిలతో..’ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ ఒక హాలీవుడ్‌ డైరెక్టర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ దర్శకుడు ఏ సినిమా చేసినా అందులో హీరోకి ఏదో ఒక లోపం ఉండేలా చూపిస్తాడు. అలాంటి పాత్ర మీరు కూడా రాయొచ్చు కదా’’ అని అడిగాడు. నత్తితో ఇబ్బందిపడే హీరో పాత్రపై సినిమా రాస్తే ఎలా ఉంటుందని నేను అడగ్గా.. ‘సూపర్‌ ఉంటుంది. రాయండి’ అని చెప్పాడు. ఈ కథ అలా మొదలైంది. ఈ ఐడియా వచ్చిందే బన్నీ వల్ల. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. బన్నీతో మాట్లాడిన తర్వాత నత్తి+ఎంఎంఏతో సినిమా రాశా అని పూరి చెప్పుకొచ్చారు.