Kantara movie hero rishab shares how prabhas reacted on phone call: కథ బాగుంటే చిన్న సినిమాలనైనా ప్రజలు భారీగా ఆదరిస్తారని కాంతార సినిమా నిరూపించింది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాపై ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాకు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి.
సినిమాలో రిషబ్ నటనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా పొగడ్తలతో ముంచెత్తారట. సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “ప్రభాస్ బర్త్ డే రోజు ఆయనకి విషెస్ తెలిపేందుకు నేను ఫోన్ చేశాను. కానీ నేను చెప్పేది ఏమీ పట్టించుకోకుండా ప్రభాస్ కాంతార(Kantara) మూవీ గురించే మాట్లాడారు. సినిమా బాగుందంటూ ప్రశంసించారు. ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది” అంటూ చెప్పుకువచ్చారు కాంతార హీరో రిషబ్ శెట్టి.