ఎన్నో వివాదాల తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. మార్చి 29 తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవం రోజున ఏపీలో కాకుండా తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. 1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది.
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సినిమాను వాయిదా వెయ్యాలని ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయరాదని ఈసీని కోరింది తెలుగుదేశం పార్టీ. ఈసీ ఆదేశాలతో సినిమా విడుదలకు బ్రేక్ లు పడ్డాయి. ఎన్నికలు ముగియడంతో మే 1న చిత్రాన్ని ఏపీలో విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కన్నడ నటి యజ్ఞ శెట్టి ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రను పోషించారు. ఎన్టీఆర్‌గా రంగస్థల నటుడు విజయ్ కుమార్ నటించారు. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సినిమాను నిర్మించారు.