బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రధాన పాత్రలో, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా కొన్ని లీగల్ సమస్య కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా విడుదలను రద్దు చేయాలని, ఈ సినిమాలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీని, ఆమె కుటుంబాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించారు. అదే విధంగా ఆనాడు జరిగిన సిక్కు ఉద్యమం, మారణహోమం గురించి కూడా సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని మరికొందరు కోర్టును కోరారు. ఏవీ తీసే ప్రసక్తే లేదని కంగనా రనౌన్ పట్టుపట్టి న్యాయపోరాటం చేశారు. కాగా తాజాగా కంగనా ‘ఎమర్జెన్సీ’కి కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ సినిమాను అన్‌కట్ మూవీగా విడుదల చేసుకోవచ్చని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసిందని కంగనా తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఇక విడుదలే తరువాయి. మరి ఈసారి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎప్పటికి ఫిక్స్ చేస్తుందో చూడాలి.
అయితే ఈ సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశవ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఒక సామజిక వర్గాన్ని కించపరిచేలా చిత్రీకరణ ఉందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. కాగా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం చర్చలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. అంతేకాకుండా సినిమా(Emergency) విడుదలపై నిషేధం విధించే అంశం న్యాయ సలహాతీసుకున్న వెంటనే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారని షబ్బీర్ తెలిపారు.