‘ప్రియాంక చోప్రా(Priyanka Chopra)’.. పరిచయం అక్కర్లేని నటి. బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె.. ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. అయితే తాగా ఆమె తల్లి(Madhu Chopra) మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రియాంక ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య కూడా ఎదురైందని చెప్పారు. ఒకానొక సమయంలో తన కూతురిని క్యారవ్యాన్‌లోకి ఒంటరిగా పంపాలని, కథ ప్రియాంకకు ఒంటరిగా చెప్తానని ఒక డైరెక్టర్ చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది.
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో నేను ఎప్పుడూ ప్రియాంకతోనే ఉండేదాన్ని. సెట్స్‌లో ఉన్నంత సేపు ఒక దెయ్యంలా ప్రియాంక వెంటే ఉండేదాన్ని. తనకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పుకునేది. ఒకసారి ఓ డైరెక్టర్ మా ఇద్దరిని క్యారవాన్‌లోకి రమ్మన్నాడు. మేం వెళ్లాం. కాసేపటికే ఆ దర్శకుడు నన్ను బయటకు వెళ్లమన్నాడు. కథ ప్రియాంకకు ఒంటరిగా చెప్పాలన్నాడు. దాంతో నేను బయటకు వచ్చేశాను. ఆ పరిస్థితిని ప్రియాంక(Priyanka Chopra) చాలా బాగా హ్యాండిల్ చేసింది. మా అమ్మలేకుండా నాకు కథ చెప్తే నేనెలా సినిమా చేస్తా అని చెప్పి తను కూడా బయటకు వచ్చింది’’అని ప్రియాంక తల్లి చెప్పారు. కానీ, ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.