Manchu Manoj – MBU | మోహన్ బాబు యూనివర్సిటీ(MBU) కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఫీజులు, ఇతర ఛార్జీల పేరుతో ఒక రేంజ్‌లో డబ్బులు దండుకుంటుందంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్స్ మండిపడుతున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి మరీ నోటికొచ్చినట్లు ఫీజులు గుంజుకుంటున్నారంటూ పేరెంట్స్ అసోసియేషన్.. AICTEకి లేఖ రాసింది. ఈ లేఖలో పేరెంట్స్ భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. “బలవంతపు ఫీజులు కూడా రుద్దుతున్నారు. కన్వీనర్ కోటాలో సీటు తీసుకున్న వారి నుంచి నిర్ణీత ఫీజులుకు మించి వసూలు చేస్తున్నారు. విద్యార్థులతో బలవంతంగా యూనిఫాం కొనుగోలు చేయిస్తున్నారు. డే స్కాలర్స్ కూడా కచ్చితంగా మెస్ లోనే భోజనం చేయాలి” అనే నిబంధన పెట్టారని తల్లిదండ్రుల కమిటీ ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ స్పందించారు. మోహన్ బాబు మంచి వ్యక్తి అంటూనే విద్యార్థులకు మద్దతు తెలిపారు.
‘‘విద్యార్థుల ఆందోళనలు ఎంతగా బాధించాయి. మా నాన్న, ఎంబీయూ ఛాన్సెలర్ మోహన్ బాబు.. ఎప్పుడూ విద్యార్థుల, రాయలసీమ కమ్యూనిటీ సంక్షేమానికే పెద్దపీట వేశారు. ఆయన చర్యల ఫలితమే ఈ విద్యాసంస్థల విజయం. ఆయన పాషన్, విజన్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్‌కు నా పూర్తి మద్దతు ఇస్తాను. ఈ విషయంపై ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్‌ను సంప్రదించాను. పరిస్థితులపై ఆరా తీశాను. ఆయన నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఎవరైనా తమ సమస్యలు, ఇబ్బందులు తెలపడానికి నేరుగా నాకు మెయిల్ చేయవచ్చు. వాటన్నింటిని నేను మా నాన్న దృష్టికి తీసుకెళ్తాను’’ అని మనోజ్(Manchu Manoj) తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు.