ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది. జర్నలిస్టుపై చేసిన దాడి కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ నాలుగు వారాల గడువుతో నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మోహన్ బాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో భాగంగా నేడు ఆయనకి సుప్రీం(Supreme Court)లో ఉపశమనం లభించింది.
కాగా, తన కుమారుడు మంచు మనోజ్(Manchu Manoj)తో ఉన్న ఆస్తి వివాదంపై ప్రశ్నిస్తుండగా ఆగ్రహానికి గురైన మోహన్ బాబు జర్నలిస్టు మైక్‌ను లాక్కుని దాడి చేసిన విషయం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడిలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు అతనికి సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. మోహన్ బాబు(Mohan Babu) చర్యను ఖండించాయి. దీంతో రంగంలోకి దిగిన ఆయన పెద్దకుమారుడు మంచు విష్ణు(Manchu Vishnu) జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. జర్నలిస్టులను కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మోహన్ బాబు కూడా ఆవేశంలో జరిగిపోయిందంటూ లెంపలేసుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి ఆ జర్నలిస్టును పరామర్శించారు.