మలయాళ సినిమా ఇండస్ట్రీని జస్టిస్ హేమ కమిషన్ రిపోర్ట్ వణికిస్తోంది. ఈ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్టార్ యాక్టర్ మోహన్ లాల్(Mohanlal) ప్రకటించారు. ఆయనతోపాటు 17 మంది సభ్యులు ఉన్న పాలకమండలి కమిటీ కూడా రాజీనామా చేసింది. పాలకమండలి సభ్యుల ఆన్లైన్ మీటింగ్ లో మోహన్ కాల్ ఎమోషనల్ అయ్యారు. ఈ నిర్ణయం తీసుకునేముందు మమ్ముట్టి(Mammootty)తో మోహన్ లాల్ చర్చించారు. నిర్ణయం బాగుందని మమ్ముట్టి కూడా చెప్పారని మోహన్ లాల్ వెల్లడించారు.
ఇటీవల అమ్మ కమిటీ సభ్యులపై కొందరు నటీనటులు చేసిన ఆరోపణలతో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని మోహన్ లాల్(Mohanlal) స్పష్టం చేశారు. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో ఫిమేల్ యాక్టర్ల స్థితిగతులపై పలు దిగ్భ్రాంతికర విషయాలను జస్టిస్ హేమ కమిషన్ వెలికితీసింది. ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులకు గురవుతున్నారని కమిషన్ రిపోర్టు నివేదించింది. ఇలాంటి సమయంలో నటుడు మోహన్ లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అమ్మ సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఉండగా… నటుడు జగదీష్, జయంత్ చేర్తల, బాబూరాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమోడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఘటనపై కేరళ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మళ్లీ ఇండస్ట్రీలో ప్రముఖులపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో విచారణకై ఓ స్పెషల్ కమిటీ(Hema Committee Report)ని ఏర్పాటు చేసింది. వెంటనే నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్ధికీ రాజీనామా చేశారు. సిద్ధికీ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సిద్ధికీ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమని ఆమె వెల్లడించారు.