‘అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాలీవుడ్.. మన దేశాన్ని తక్కువ చేసి చూపింది’ కన్నడ నటుడు రిషబ్ శెట్టి(Rishab Shetty) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై బాలీవుడ్ అంతా ఏకమై మండిపడుతోంది. కొందరైతే ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కాగానే రిషబ్ తన స్థాయిని మించిన మాటలు మాట్లాడుతున్నాడని, ఒక్క సినిమాకే ఇంత అహంకారం, అహంభావం మంచిది కాదంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. దక్షిణాదిలో కూడా చాలా మంది రిషబ్ అలా అనుండకూడదంటూ సాఫ్ట్‌గా చెప్తుండటంతో తన వ్యాఖ్యలపై రిషబ్ మరోసారి స్పందించాడు. తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చారు. అబుదాబి వేదికగా జరుగుతున్న ఐఫా 2024(IIFA 2024) ఈవెంట్ వేదికగా తన మాటలకు వివరణ ఇచ్చాడు రిషబ్.
‘‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. కొందరు కావాలనే నా మాటలను వక్రీకరించారు. బాలీవుడ్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు. ఈ విషయంపై తప్పకుండా క్లారిటీ ఇస్తాను. అప్పుడు ఈ విషయంపై పూర్తిగా మాట్లాడుకుందాం. నా వివరణ ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదు’’ అని రిషబ్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో ఔట్ స్టాండింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ కన్నడ సినిమా అవార్డును రిషబ్ సొంతం చేసుకున్నారు. తనకు ఇంతటి అవార్డును సొంతం చేసిన ప్రేక్షకుల కోసం రానున్న కాలంలో మరెన్నో అద్భుత చిత్రాలు తెరకెక్కిస్తానని చెప్పాడు రిషబ్ శెట్టి(Rishab Shetty).