నటుడు అల్లు అర్జున్‌కు(Allu Arjun) భారీ ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ షరతులను సడలించింది. ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చింది. అవసరమైనప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరు కావాలనే షరతుతో, నిర్దేశిత ఫారెన్ టూర్లకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.
ప్రతి ట్రిప్‌కు సంబంధించి తన టూర్ షెడ్యూల్‌ను ఎస్‌హెచ్‌ఓకి తెలియజేయాలని, ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు అల్లు అర్జున్ తాను ఉంటున్న ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందించాలని ఆదేశించింది. అయితే జనవరి 10న కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో అల్లు అర్జున్‌కు జనవరి 3న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ… రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య లేదా చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు విచారణ అధికారి ముందు హాజరు కావాలని కోర్టు సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకుండా కూడా నిషేధం విధించారు. అదనంగా, విచారణకు సహకరించాలని, కొనసాగుతున్న విచారణలో జోక్యం చేసుకోకుండా లేదా సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండాలని కోర్టు బన్నీని ఆదేశించింది.
తొక్కిసలాట కేసుకు సంబంధించి డిసెంబర్ 13న ఏ11 గా ఉన్న అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టవగా.. కోర్టు జనవరి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. జనవరి 3న కోర్టు రెగ్యులర్ బెయిల్ జారీ చేసింది.
డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మరణించింది. ఆమె ఎనిమిదేళ్ల కొడుకు శ్రీతేజ్(Sritej) తీవ్రంగా గాయపడ్డాడు. అదే థియేటర్ లో షో చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ నీ చూడటానికి భారీగా అభిమానులు చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట తర్వాత రేవతి కుటుంబీకులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, అతని బౌన్సర్లు, థియేటర్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.