సినిమాలో నటించడం వరకే తన బాధ్యత, ప్రమోషన్ తో తనకు సంబంధం లేదని ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తోంది నయనతార. ఈ విషయంలో ఆమెపై కొంతమంది ఫిర్యాదులు చేసినా వాటిని లెక్కచేయడం లేదామె. నటించడం వరకే తను రెమ్యూనరేషన్ తీసుకుంటూ, కాల్షీట్లను కేటాయిస్తున్నట్టుగా ప్రమోషన్ కు మళ్లీ సమయం కేటాయించలేనట్టుగా నయనతార తేల్చి చెబుతూ ఉంది. తన తీరు అంతే అని, నచ్చినవాళ్లే తన దగ్గరకు రావాలని, అది నచ్చనివాళ్లు తనకు అవకాశాలు ఇవ్వనక్కర్లేదన్నట్టుగా నయనతార ముందు నుంచి వ్యవహరిస్తూ వస్తుంది.
అదే పద్దతిని ఆమె చిరంజీవి సినిమాకు కూడా పాటించింది.
సైరా నరసింహారెడ్డి లో హీరోయిన్ గా నటించిన నయనతార ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ప్రోగ్రామ్ లో కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల ట్రైలర్ ఒకేసారి విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి ఆ సినిమాలో నటించిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే నయనతార మాత్రం ఆ ఛాయ దరిదాపుల్లో కూడా కనిపించలేదు!
తనకు చిరంజీవి సినిమా అయినా ఒకటే, ఇతర హీరోల సినిమాలు అయినా ఒకటే అనే సంకేతాలను గట్టిగానే ఇచ్చింది ఈ హీరోయిన్ అని అంటున్నారు సినీజనాలు. ఈ సినిమా ప్రమోషన్ కు హాజరైతే ఇన్నిరోజులూ తను వ్యవహరించిన తీరు తప్పనే సంకేతాలను ఆమె ఇచ్చినట్టు అవుతుందని…ఆ తరువాత సినిమాల విషయంలో కూడా ప్రమోషన్ యాక్టివిటీస్ లో అటెండ్ కావాల్సి ఉంటుందని…అందుకే సైరా సినిమా ప్రమోషన్ ను కూడా నయనతార ఎస్కేప్ చేసి, తెలివిగా వ్యవహరించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.