Sandhya Theater Incident | సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు చేరింది. ఈ వ్యవహారంపై న్యాయవాది రామారావు NHRC కి ఫిర్యాదు చేశారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన మానవ హక్కుల కమిషన్.. తెలంగాణ డీజీపీ జితేందర్ కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొంది.
పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ ఆర్టీసి క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు భారీగా సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ప్రస్తుతం ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఘటన(Sandhya Theater Incident) జరిగిన రోజున జనాన్ని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. లాఠీ చార్జి చేయడంపై రామారావు చేసిన ఫిర్యాదు మేరకు డీజీపీ వివరణ కోరుతూ తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటనపై 4 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.