‘మా’ పీఠం మంచు విష్ణుదే

0
120

తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేపిన మా ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. నువ్వానేనా అన్నట్లు తలపడిన పోరులో ప్రకాశ్​రాజ్​పై మంచు విష్ణు పైచేయి సాధించారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. గతకొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరువర్గాలు చిత్రసీమను వేడెక్కించాయి.

‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది.‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 665మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనరల్‌ సెక్రటరీ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత రాజశేఖర్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబుమోహన్‌ పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన హోరా హోరీ పోరులో శ్రీకాంత్‌ విజయం సాధించారు. ‘మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా..నాగినీడుకు 284 ఓట్లు పోలయ్యాయి.