సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో గుర్తుకొస్తాడు. సినిమాల పరంగా చూస్తే మాత్రం పక్కా విలన్ గుర్తొస్తాడు. అందులోనూ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి(Arundhati)’ సినిమాలో సోనూసూద్ పోషించిన ‘పశుపతి’పాత్ర(Pasupathi Character) అతనికి ఒక ఐకానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతకుముందు ఎన్నో విలన్ పాత్రలు చేసినప్పటికి సోనూసూద్‌కు ఒక వివేష గుర్తింపు తెచ్చింది మాత్రం ఈ పాత్రనే చెప్పొచ్చు.
అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో సోనూసూద్ కనబరిచిన నటన ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. అయితే ఈ పాత్రపై తాజాగా సోనూసూద్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ పాత్ర ప్రేక్షకులకే కాదు.. తనకు కూడా చాలా స్పెషల్ అని చెప్పాడు.
‘‘నా కెరీర్‌లో ఏదైనా పాత్ర కోసం అత్యధికంగా కష్టపడ్డానంటే అది ‘పశుపతి’ క్యారెక్టరే. అది నాకు ఒక పాత్రే కాదు అంతకుమించి. కేవలం మేకప్ వేసుకోవడానికే 6-7 గంటలు పట్టేది. ఆ మేకప్ వల్ల దద్దుర్లు కూడా వచ్చాయి. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిగింది. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక కూడా డైరెక్టర్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా మళ్ళీ ఏదైనా సీన్ రీషూట్ చేయలంటారేమో అని భయపడేవాడిని.
సినిమా విడుదలైన తర్వాత ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చా. థియేటర్ల దగ్గర ప్రేక్షకుల రద్దీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఒక సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారా అని నాకు అప్పుడు అర్థమైంది. అదంతా జరిగి అప్పుడే 15 ఏళ్లు గడియాంటే నమ్మలేకపోతున్నా’’ అని Sonu Sood చెప్పుకొచ్చాడు.