బ్రేకింగ్: ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సంచలన నిర్ణయం

Prakash Raj Panel's sensational decision

0
98

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు విజయం సాధించారు. అయితే తమ ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని అన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.

నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని మీరు మార్చకపోతే మా సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజీనామా చేశారు. ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానెల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం. పని బాగా జరగాలంటే అది ముఖ్యం. మెంబర్స్‌ ఉన్న వాళ్లలో అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి పనిచేయగలమా అనిపించింది. మా ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ  కూడా తన పదవికి రాజీనామా చేశారు. ‘‘నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా, నాకు సంతోషంగా లేదు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా.

గతంలో కూడా ఈసీ మెంబర్‌గా పని చేశా అని హీరో తనీష్ అన్నారు. సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయి. నరేశ్‌ గారిని పని చేయనీయడం లేదని ఆయన చెప్పారు. మేం కేవలం ఈసీ మెంబర్స్‌. ఆయన చేసే పనులను మేము ఎక్కడ అడ్డుకుంటాం. మోహన్‌బాబుగారు, విష్ణు, మనోజ్‌ అన్నలు అంటే నాకు ఇష్టం. ఓట్ల లెక్కింపు సందర్భంగా మోహన్‌బాబు అసభ్యపదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారు. బెనర్జీగారు అడ్డుకునేందుకు వస్తే, ఆయన్నూ తిట్టారు. ఆ తర్వాత విషయం తెలిసి విష్ణు, మనోజ్‌ అన్నలు నన్ను ఓదార్చారు. అయినా ఆయన అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపారు.