Rajadhani Files | రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు ఇటీవల తెరకెక్కించడం ఎక్కువైపోయింది. అది కూడా ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. ఇప్పటికే వైయస్ జగన్ జీవితం ఆధారంగా వ్యూహం, యాత్ర-2 తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ అనే చిత్రం తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమతి బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘పరదాల ముఖ్యమంత్రి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘కష్టపడమని చెప్తే.. ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి’.. ‘ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి’ అంటూ ముఖ్యమంత్రి పాత్రధారి చెబుతాడు. ‘140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా’.. ‘ఏడాది కాకపోతే.. నాలుగేళ్ళకైనా చదును చేస్తాం.. పంటలు పండిస్తాం.. రైతులంరా..’ అనే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ‘మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. మహా పాదయాత్ర’ అంటూ ఎలాగైనా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని రైతుల పోరాటాలను చూపించారు.
Rajadhani Files | అయితే మూవీలో అమరావతి పేరును అయిరావతిగా, ఆంధ్రప్రదేశ్ పేరును అరుణప్రదేశ్‌గా మార్చారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ సంగీత దర్శకడు మణిశర్మ సంగీతం అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, సుద్ధాల అశోక్ తేజ గేయ రచయితగా పనిచేశారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.