దిగ్గజ సినీ నటుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్..ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా..ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.
రజనీకాంత్‌ను 2019 ఏడాదికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మార్చిలోనే ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా సినీరంగానికి రజనీకాంత్ చేసిన విశిష్ఠ సేవలకుగానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
అవార్డు రావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇంత గొప్ప అవార్డు తనకు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఇంత మంచి తరుణంలో తన గురువు కె. బాలచందర్ మన మధ్య లేకపోవడం బాధిస్తోందన్నారు.
ఈరోజే తన కూతురు సౌందర్య ఎంతో ఇష్టపడి సిద్ధం చేసిన ‘హూట్ యాప్’ను విడుదల చేస్తున్నానని వెల్లడించారు. వాస్తవానికి రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గత ఏప్రిల్ లోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా అవార్డుల ప్రధానం వాయిదా పడింది.