మెగా ఫాన్స్ కాస్త డల్ అయిన ప్రతిసారీ రామ్ చరణ్ వారికి ఏదో విధంగా జోష్ తెస్తున్నాడు. ప్రజారాజ్యం పోయినపుడు ఫాన్స్ డీలా పడితే వెంటనే మగధీరతో రికార్డులు తిరగరాసి సినిమా రంగం వరకు తాము రారాజులమని చాటుకున్నాడు. ఆమధ్య అజ్ఞాతవాసి పరాజయంతో ఫాన్స్ కుదేలైపోతే ’రంగస్థలం’తో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసి శభాష్ అనిపించాడు.
జనసేన ఘోర పరాజయానికి తోడు ప్రభాస్ రైజ్తో సినిమా రంగంపై కూడా పట్టు కోల్పోతున్నామనే భయం అలముకున్న వేళ ’సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ఆవిష్కరించి మరోసారి ఫాన్స్ కి ఉత్సాహమిచ్చాడు.
చీప్ గ్రాఫిక్స్ జోలికి పోకుండా, నిర్మాణంలో రాజీ పడకుండా కోట్లు ధారపోసి వార్ ఎపిసోడ్స్ అద్భుతంగా రావడంలో చరణ్ చాలా కృషి చేసాడు. బడ్జెట్ పరంగా అక్కడక్కడా రాజీ పడాలని దర్శకుడు సురేందర్ భావించినా కానీ చరణ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎంత ఖర్చు పెడితే తెరపై ఆ భారీతనం కనిపిస్తుందో అంతా ఖర్చు పెట్టాల్సిందేనన్నాడు.
ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయిన తర్వాత కేవలం తెలుగువాళ్లే కాకుండా నార్త్ ఇండియా వాళ్లు కూడా నిర్మాణ విలువలని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. చరణ్ చొరవ చేయకపోతే ఈ విధంగా తెరకెక్కేది కాదని ఈ చిత్రానికి పని చేసిన వారే చెబుతున్నారు.