Reduced Ticket Rates for Avatar 2: భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా అవతార్-2. దశాబ్దం క్రితం విడుదలైన అవతార్ -1 కి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకనిర్మాతలు. భారీగా విడుదలైన ఈ సినిమా టికెట్లు కూడా భారీగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాని థియేటర్లో చూడటానికి సామాన్యులు జంకుతున్నారు. అయినప్పటికీ సినిమా బావుందంటూ పబ్లిక్ టాక్ పెరగడంతో రోజురోజుకీ కలెక్షన్లను కూడా అంచనాలకి మించి కొల్లగొడుతోంది అవతార్-2. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.7000 కోట్లకు పైగా సంపాదించింది.
మన ఇండియన్ సినిమాలతో పోటీపడుతూ ఇక్కడ కూడా వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. అయితే అవతార్-2 మూవీ నుండి అదిరిపోయే న్యూస్ వచ్చింది అభిమానులకి. ఈ సినిమా టికెట్ ధరలు(Avatar 2 ticket rates) సగానికి సగం తగ్గాయి. ‘అవతార్ 2’ త్రిడి వెర్షన్ టికెట్ ధరలు తగ్గాయి. IMAX, 4DXలు కాకుండా 3D వెర్షన్ టికెట్ ధరను రూ.300 నుంచి రూ.150కి తగ్గించారు. థియేటర్లకు వచ్చే జనాల్లో ఎక్కువగా త్రీడీ వెర్షన్ చూడటానికే ఇష్టపడుతున్నట్టు కలెక్షన్స్ చెబుతున్నాయి. ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు టికెట్ ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే మరిన్ని డబ్బులు వసూల్ చేసుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు 3D కళ్లద్దాల ఛార్జీలు కూడా థియేటర్‌లలో కూర్చునే సీట్ ఆధారంగా రూ.20 నుంచి రూ. 50 వరకూ ఉంటుందని తెలిపారు.