కుటుంబంలో ఒక్కరైనా రాజకీయాల్లో ఉంటే.. ప్రతి హీరో ఎదుర్కొనే ప్రశ్న మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? ప్రస్తుతం సాయి దుర్గా తేజ్(Sai Dharam Tej)కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి తేజ్‌కు ఈ ప్రశ్న పదేపదే ఎదురవుతోంది. దీంతో తాజాగా తన రాజకీయ ఎంట్రీపై సాయి తేజ్ నోరు విప్పాడు. రాజకీయాల్లోకి రావడం అంటే ఏదో ఒక పార్టీ కండువా కప్పేసుకోవడం కాదని అన్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలంటే అనేక అంశాలపై, విషయాలపై అవగాహన ఉండాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘‘ప్రస్తుతం నా ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉంది. మరెన్నో విభిన్నమైనా, విలక్షణమైనా పాత్రల్లో నటించాలని, సినిమాలు చేయాలని ఉంది. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్తకొత్త సినిమాలతో అలరించాలని అనుకుంటున్నా. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన నాకు ప్రస్తుతం లేదు. పాలిటిక్స్‌లోకి రావాలంటే ఎన్నో విషయాలు తెలిసుండాలి. ప్రజల సమస్యలపై అవగాహన ఉండాలి. వారి సమస్యలను తీర్చే నేర్పరితనం కూడా కావాలి’’ అని Sai Dharam Tej చెప్పుకొచ్చాడు.