ప్రతి ఒక్కరి గోల్ ఒకటే.. సక్సెస్. కొందరు దీనిని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళతారు. అదే విధంగా సక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక నిర్వచనం ఉంటుంది. సినీ ఫీల్డ్‌లో అయితే సినిమాలు హిట్ కావడమే సక్సెస్ అనుకుంటారు కొందరు. కానీ తన దృష్టిలో మాత్రం సక్సెస్‌కు వేరే నిర్వచనం ఉందని నటి సమంత రుత్ ప్రభు(Samantha) తెలిపింది. సక్సెస్‌పై సమంత వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో(Indian Film Festival of Sydney) పాల్గొన్న సమంత.. సక్సెస్‌పై స్పీచ్ ఇచ్చారు. సక్సెస్ అంటే విజయాలు సాధించడం మాత్రమే కాదని చెప్పింది. సక్సెస్ అంటే సామాజిక కట్టుబాట్లు, పట్టింపులు నుంచి విముక్తి పొందడమని తెలిపింది సమంత. స్వేచ్ఛగా జీవించడం, మూస ధోరణి భావనలను సవాల్ చేయడం గురించి ఆమె ప్రత్యేకంగా మాట్లాడింది.
‘‘నా దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం. నేను విజయవంతమయ్యానని ఇతరులు చెప్పేవరకు ఎదురుచూస్తూ ఉండను. సక్సెస్ అంటే.. మనకు నచ్చినట్లు జీవించడం. అలాగే మన అభిరుచికి తగ్గట్టుగా పనులు చేసుకోవడం. అంతేకానీ మహిళలను ఒకచోట బంధించి ఇది చేయాలి? ఇది చేయకూడదు.. అని చెప్పడం కాదు. నిజ జీవితంలో ఎన్నోరకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలో సమర్థంగా రాణించగలగడమే సక్సెస్’’ అని సమంత(Samantha) తన నిర్వచనం చెప్పింది.