ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసిందని వార్త సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ కలవరం రేపింది. దీనిపై సింగర్ కల్పన కుమార్తె క్లారిటీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ… తన తల్లి ఆత్మహత్యాయత్నం చేశారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. మా అమ్మకి ఎటువంటి సమస్యలు లేవు. ఆమె పూర్తిగా క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంది. ఆమె ఒక గాయని, PhD, LLB కూడా చదువుతోంది. ఇది ఆమెలో నిద్రలేమికి దారితీసింది. దీంతో నిద్రలేమికి చికిత్స కోసం తనకి డాక్టర్ సూచించిన మాత్రలను తీసుకుంది. ఒత్తిడి కారణంగా, కొంచెం ఎక్కువ మోతాదులో మందులు తీసుకున్నారు. దయచేసి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారని తప్పుడు కథనాలు ప్రచురించవద్దు” అని విజ్ఞప్తి చేశారు.
అలాగే నా తల్లిదండ్రులు ఇద్దరూ పూర్తిగా సంతోషంగా ఉన్నారు. నా కుటుంబంలో అందరూ బాగానే ఉన్నారు. ఆమె త్వరలో కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఇది ఆత్మహత్యాయత్నం కాదు. ఇది నిద్రలేమి మాత్రల స్వల్ప అధిక మోతాదు వలన కలిగిన అనారోగ్య సమస్య మాత్రమే అని కల్పన కుమార్తె స్పష్టం చేశారు. కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో KPHB పోలీస్ స్టేషన్ కు కల్పన నివసిస్తున్న అపార్ట్ మెంట్ కమిటీ నుండి అత్యవసర కాల్ వచ్చిందని తెలుస్తోంది. కల్పన(Singer Kalpana) నివాసానికి చేరుకున్న అధికారులు ఆమె అపార్ట్ మెంట్ తలుపు తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో వంటగది కిటికీ నుంచి లోపలికి చూసిన పోలీసులకి కల్పన తన మంచం మీద అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె నిద్రమాత్రలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతానికి, గాయని పరిస్థితి స్థిరంగా ఉంది.