దేశమంతా షేక్ చేసిన ఓటీటీ సిరీస్‌లలో మిర్జాపూర్(Mirzapur) టాప్‌లో ఉంటుంది. తొలుత కేవలం హిందీలో మాత్రమే తీసిని ఈ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా దీనిని డబ్ చేశారు. ఇప్పటికి మూడు సీజన్లతో దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రజలను అలరించింది. మిర్జాపూర్ నాలుగో సీజన్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ ప్రేక్షకుల హోప్స్‌ను మరింత పెంచారు. తాజాగా ఈ సిరీస్ విషయంలో మేకర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిర్జాపూర్ సిరీస్‌ను ఇప్పుడు సినిమాగా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
అదే అతిపెద్ద ప్రశ్న
‘మిర్జాపూర్(Mirzapur)’ సిరీస్‌లో హీరోకన్నా విలన్ అయిన మున్నాభాయ్ పాత్రకే క్రేజ్ ఎక్కువ. దానికి తోడు ఇందులో హింస, బూతులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాటినే ఎగబడి చూశారు. కానీ ఇన్నాళ్లూ ఓటీటీ కావడంతో సరిపోయింది. ఇప్పుడు సినిమాగా అంటే ఈ బూతులు, హింస అంత స్థాయిలో ఉండటానికి వీల్లేదు. దానికి తోడు తొలి రెండు సీజన్‌లలో మున్నాభాయ్ పాత్ర ఉండటంతో ఆ రెండు సీజన్‌లో బంపర్ హిట్ అయ్యాయి. మూడో సీజన్‌లో ఈ పాత్ర లేకపోవడంతో సోసోగా అనిపించింది. ప్రేక్షకులు కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఇలాంటి సమయంలో నాలుగో సీజన్‌తో పాటు ఓ సినిమా కూడా అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఇప్పుడు ఓటీటీ సిరీస్‌ను బంపర్ హిట్ చేసిన అంశాలు బూతులు, హింస, మున్నాభాయ్(Munnabhai) పాత్ర లేకుండా సినిమాను ఎలా ముందుకు సాగిస్తారు, ఆ ఇంటెన్సిటిని ఎలా మెయింటెన్ చేస్తారనేదే ఇప్పుడు మేకర్స్ ముందున్న అసలు పెద్ద ప్రశ్న. మరి దీనిని మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలంటే 2026 వరకు ఆగాల్సిందే.