సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ(Super Star Krishna Statue) కార్యక్రమం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘనంగా జరిగింది. కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ఫాన్స్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సినిమాల్లోకి వచ్చినా కూడా బుర్రిపాలెం పేరు ఎత్తకుండా కృష్ణ ఏ విషయం మాట్లాడేవారు కాదని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ పేరు ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.
గ్రామానికి ఏదైనా అవసరం ఉంటే, తమ దృష్టికి తీసుకు వస్తే కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర కారణాల వల్ల మహేష్ బాబు రాలేకపోయానని.. మరోసారి కచ్చితంగా ఈ గ్రామానికి వస్తానని చెప్పాడని ఆదిశేషగిరిరావు పేర్కొన్నారు. తన సినిమాలతో పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ కృష్ణ ఎదిగారని ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు(Sudheer Babu) తెలిపారు. ఆయన ఆశలు, సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన భాద్యత తమపై ఉందన్నారు. ఈ విగ్రహాన్ని చూస్తే ఆయన ఇక్కడే సజీవంగా ఉన్నట్లు ఉందన్నారు. కృష్ణ, ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావులా మా పిల్లలు కూడా మంచి అనుబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
బుర్రిపాలెంలో ఓ రైతు కుటుంబం నుంచి సినీ పరిశ్రమకి వెళ్లి బుర్రిపాలెం బుల్లోడుగా కోట్లాటిమంది ప్రేక్షకుల ప్రేమను పొందారని ఆయన కుమార్తె మంజుల తెలిపారు. ఆయనకి ఈ గ్రామంపై ఎంతో ప్రేమ ఉండేదన్నారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కృష్ణ గారి విగ్రహం(Super Star Krishna Statue) ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా ఉందంటూ పేర్కొన్నారు. కృష్ణ విగ్రహం చూస్తుంటే కళ్ళ ముందే సజీవంగా ఉన్నట్లు కనిపిస్తుందని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. 350కి పైగా సినిమాలు చేసిన మహానుభావుడు సూపర్‌స్టార్ కృష్ణ అని కొనియాడారు. జుంబా రే జుజుంబరే పాట చిత్రీకరించే సమయంలో కృష్ణ ముసిముసిగా నవ్వుతూ అందరిని ఉత్సాహపరిచారని గుర్తుచేసుకున్నారు. ఏఐ టెక్నాలజీతో త్వరలోనే కృష్ణతో సినిమా చేస్తా అని వెల్లడించారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, హీరో సుధీర్ బాబు దంపతులు, కృష్ణ కుమార్తెలు మంజుల, పద్మావతి, దర్శకుడు కృషారెడ్డి, మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.