తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అభిమాన నటుడు, దివంగత డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్(vijayakanth) సమాధి వద్ద ఆయనను తలుచుకుని బోరున ఏడ్చేశారు. విజయకాంత్ చనిపోయినప్పుడు విదేశాల్లో ఉన్న సూర్య.. తాజాగా చెన్నై చేరుకుని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. నేలపై కూర్చుని కెప్టెన్‌ను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూన ఆయనతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
తన అన్న విజయకాంత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపోయారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు ఎలాంటి గుర్తింపు రాలేదన్నారు. ఆ సమయంలో ‘పెరియన్న’ మూవీలో తొలిసారి విజయకాంత్‌తో కలిసి పనిచేశానని.. సెట్‌లో ఆయనతో కలిసి భోజనం చేశానని గుర్తు చేసుకున్నారు. నటన, డ్యాన్స్, ఫైట్స్ ఎలా చేయాలో చెప్పి తనలో స్ఫూర్తి నింపారన్నారు. కెప్టెన్ మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటని సూర్య(Suriya) వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చిత్రపరిశ్రమతో పాటు రాజకీయాలకు అన్న చేసిన సేవలు మరువలేమని.. తమిళ నటీనటుల సంఘం భవనానికి విజయ్ కాంత్ పేరు పెట్టాలని సూర్య సూచించారు.