బాలీవుడ్ భామ కంగనా రనౌత్ నటించిన తాజాగా సినిమా ఎమర్జెన్సీ(Emergency). ఈ మూవీలో కంగనా.. కాంగ్రెస్ కీలక నేత, భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. ఈ సినిమాపై అనేక వివాదాలు చలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలపై తెలంగాణలో నిషేధం విధించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో షబ్బీర్‌ను కలిసి ‘ఎమర్జెన్సీ’ స్క్రీనింగ్‌పై నిషేధం విధించాలని కోరారు. ఈ సినిమా సిక్కు సమాజాన్ని కించపరిచేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశవ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఒక సమాజ వర్గాన్ని కించపరిచేలా చిత్రీకరణ ఉందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. కాగా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం చర్చలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. అంతేకాకుండా సినిమా(Emergency) విడుదలపై నిషేధం విధించే అంశం న్యాయ సలహాతీసుకున్న వెంటనే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారని షబ్బీర్ తెలిపారు.