సినిమా అయినా, నాటకం అయినా..
నటన అంటే ఆటలు కాదు, అదొక నిరంతర యుద్ధం.
కొందరు పుట్టుకతో ప్రతిభావంతులుగా పుడతారు. మరికొందరు శిక్షణతో మొదలై తమ రంగంలో నిష్ణాతులుగా ఎదుగుతారు. అలాంటి వారి వరుసలో ముందు నిలుస్తారు సినీ, టీవీ, రంగస్థల నటి మరియు దర్శకురాలు డా. శ్రీజ సాదినేని.
నటన అంటే ఏమిటి?
వెండితెరపై వెలుగులు చిందాలని, సెలబ్రిటీ స్టేటస్ పొందాలని కలలు కంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతూ, వేషాలు అంటూ ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగే ఆశా జీవులు, రంగస్థలంపై అయినా తమ ప్రతిభను ప్రదర్శించి నటులుగా ఎదగాలనే తపనతో శిక్షణా సంస్థలలో చేరే నట పిపాసులు, వీరిని పావులుగా వాడుకుని పబ్బం గడుపుకునే స్వార్థపరులు ఈ రంగుల ప్రపంచంలో నిరంతరం దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి, సరైన శిక్షణనిచ్చి, నటులుగా తీర్చి దిద్దుతున్నారు శ్రీ జయా ఆర్ట్స్ అధినేత్రి డా.శ్రీజ సాదినేని. పంతొమ్మిది సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందికి తర్ఫీదు ఇవ్వటమే కాకుండా అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు…
ఆటలు, పాటలతో పెరగవలసిన శ్రీజ చిన్న తనంలోనే కుటుంబ బాధ్యత తలపై వేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా అధైర్య పడకుండా.. సంగీతం, నాట్యం, నటన, రచన, దర్శకత్వం,వ్యాఖ్యానం, గాత్ర ధారణం వంటి ఎన్నో కళలలో ఆరితేరి తనదైన ముద్రను వేసుకోవడమే కాకుండా చిన్నవయసులోనే గురువుగా మారి శ్రీ జయా ఆర్ట్స్ సంస్థను స్థాపించి ఆసక్తి కలిగిన వారికి యాక్టింగ్,యాంకరింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, డైరెక్షన్,థియేటర్ యాక్టింగ్ వంటి విభాగాలలో శిక్షణను ఇవ్వటమే కాకుండా పోటీలలో కూడా పాల్గొంటూ తమ శిష్యులకు కూడా బహుమతులు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
పంతొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో..
2003 లో శ్రీ జయా ఆర్ట్స్ స్థాపించాక ఎన్నో నాటకాలు, నాటికలు తన దర్శకత్వం లోనే రూపొందించి, నిర్మాతగా వ్యవహరించి ప్రదర్శనలు ఇవ్వడమే కాక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను కూడా అందుకున్నారు.
ఎక్కువ నాటకాల డైరెక్టర్ గా..
తెలుగులో రంగస్థల నటులు అంటే చిన్న చూపు ఉంది.అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. కానీ బాలనటిగా రంగస్థలంపై అడుగుపెట్టిన శ్రీజ తన తండ్రి ప్రోత్సాహంతో, తన పట్టుదలతో నటిగానే కాకుండా రచన, దర్శకత్వం,మేకప్,లైటింగ్,కాస్ట్యూమ్ డిజైనింగ్,సెట్ డిజైనింగ్, మ్యూజిక్ కంపోజిషన్, లిరిక్ రైటింగ్ వంటి అన్ని విభాగాలలో శిక్షణ పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాకుండా తన యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు.
పరిషత్ నిర్వహణ..
ఏ కళకైనా ఆదరణ కావాలి, ప్రోత్సాహం కావాలి. అప్పుడే ఆ కళ కళలను వెదజల్లుతూ ప్రకాశిస్తుంది. అలాగే బాల్యం నుండే కళల్లో ఆరితేరిన శ్రీజ నాటకాలపై తనకున్న గౌరవంతో శ్రీ జయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను కూడా నిర్వహించారు.
ఎక్కువ నాటకాలు డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ గా..
2003 నుండి ఇప్పటి వరకు 30 ప్లేలను డైరెక్ట్ చేశారు శ్రీజ సాదినేని. అందులో 5 నాటకాలు, 25 నాటికలు. కాగా డిసెంబర్ 30 శ్రీ జయా ఆర్ట్స్ పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లమాకాన్ కల్చరల్ సెంటర్ లో సావరియా అనే ట్రయాలజీ నాటకాన్ని మొదటి భాగంగా ప్రదర్శించబోతున్నారు. ఈ నాటకాన్ని కూడా రచించి, నిర్మించి,ఇందులో ముఖ్య భూమికను పోషించబోతున్న శ్రీజ సాదినేనికి తను డైరెక్ట్ చేస్తున్న 31వ నాటకం కావడం విశేషం.
యువతకు అవకాశాలు..
ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ విలువ పెరుగుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో సైతం థియేటర్ ఆర్టిస్ట్ లకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఆసక్తి కలిగిన వారికి థియేటర్ ఆర్ట్స్ వర్క్ షాప్ లో శిక్షణను ఇచ్చి వారితో ప్రదర్శనలు ఇప్పిస్తున్న డా శ్రీజ సాదినేని తమ 31వ వర్క్ షాప్ లో భాగంగా డిసెంబర్ 30,31 తేదీలలో తన విద్యార్థులతో సావరియా అనే తెలుగు ట్రయాలజీ నాటకం మొదటి భాగం ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ లో రాత్రి 8 గంటలకు ప్రదర్శించ బోతున్న ఈ నాటకాల టికెట్స్ వెన్యూ లో లభిస్తాయి. అలాగే book my show లో కూడా టికెట్స్ లభిస్తాయి.