Flash- ఏపీలో ఇక 26 జిల్లాలు..కొత్త జిల్లాల పేర్లు ఇవే!

There are 26 more districts in AP. These are the names of the new districts

0
111

ఏపీ​లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగంగా అడుగులు పడుతున్నాయి. లోక్​సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు నోటిఫికేషన్​ విడుదల చేసింది సర్కార్. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలని నిర్ణయించారు. అతిపెద్దదిగా ఉన్న గిరిజన లోక్‌సభ నియోజకవర్గం అరకును.. రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించారు. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం జిల్లా’ని ఏర్పాటు చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా నామకరణం చేయనున్నారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాని, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాని ఏర్పాటు చేయనున్నారు.

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాల వ్యావహారిక నామాలతో ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా… ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాతపేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నిటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా, కొన్నిటికి బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్‌, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకుని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.

చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉంటుంది. దాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన బాలాజీ జిల్లాలోకి తెచ్చారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా పరిధిలోకి తెచ్చారు.

మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్‌ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.

ఈ మార్పులు, చేర్పుల వల్ల కొన్ని జిల్లాల పరిధిలోకి 8 శాసనసభ నియోజకవర్గాలు వస్తుంటే, కొన్ని జిల్లాలు ఆరు శాసనసభ స్థానాలతోనే ఏర్పాటవుతున్నాయి.