మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చరణ్.. కడప దర్గాను(Kadapa Dargah) సందర్శించారు. కాకపోతే అయ్యప్పమాలలో ఉండి చెర్రీ.. కడప దర్గాను సందర్శించడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏఆర్ రెహ్మాన్(AR Rahman)కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే తాను దర్గాను సందర్శించానని చెర్రీ ప్రకటించాడు. దర్గాను సందర్శించిన చరణ్.. అక్కడి నియమాల ప్రకారం పూజలు చేశాడు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తులు శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాల్సి ఉంటుంది. అటువంటి మాలలో ఉండి ఏకంగా దర్గాకి వెళ్లి పూజలు చేయడం ఏంటని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పలువురు ఈ విషయంపైనే రామ్ చరణ్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విమర్శలపై ఆయన భార్య ఉపాసన(Upasana) ఘాటుగా స్పందించారు. చరణ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుందే తప్ప ఎప్పుడు విభజించదని పేర్కొన్నారు.
ఈ మేరకు ఉపాసన(Upasana) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘భారతీయులు అందరూ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు’’ అని కూడా ఆమె రాసుకొచ్చారు. దాంతో పాటుగా వన్ నేషన్ వన్ స్పిరిట్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఇచ్చారు. ఆమెకు అనేక మంది మద్దతు పలుకుతున్నారు. అయ్యప్ప మాల ధరించిన వారు ఇరుముడి కట్టిన తర్వాత శబరిమల కన్నా ముందు శబరిమలకు వెళ్లే దారి మధ్యలో ఉన్న వావర్ దర్గాను సందర్శిస్తారని, అక్కడ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు కూడా చెల్లిస్తారని నెటిజన్లు రాసుకొస్తున్నారు. వావర్ దర్గాను సందర్శించడం తప్పు కానప్పుడు కడప దర్గాను సందర్శిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు.