పెళ్లి నేపథ్య కథతో తీసిన కుటుంబ కథాచిత్రం ‘వరుడు కావలెను’. ఊహలు గుసగుసలాగే, ఛలో లాంటి ప్రేమకథ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో లవర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నాగశౌర్య. అభినయప్రధాన పాత్రలతో కథానాయికగా వైవిధ్యతను చాటుకుంటున్నది రీతూవర్మ. వీరిద్దరి కలయికలో రూపొందిన తాజా చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భూమి (రీతూవర్మ) హైదరాబాద్‌లో ఏకో ఫ్రెండ్లీ స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తుంటుంది. ఆఫీస్‌లో ఆమెను చూసి అందరూ భయపడుతుంటారు. ఏది ఆమెకు ఓ పట్టాన నచ్చదు. ముప్పై ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోదు. భూమికి పెళ్లి చేయాలన్నది ఆమె తల్లి ప్రభావతి(నదియా) ఆశయం. కానీ తల్లి తీసుకొచ్చిన ప్రతి పెళ్లికొడుకును భూమి రిజెక్ట్ చేస్తుంటుంది. అప్పుడే ఓ ప్రాజెక్ట్ పనిమీద ఆకాష్ (నాగశౌర్య) హైదరాబాద్ వస్తాడు. ప్యారిస్‌లో ఆర్కిటెక్టర్‌గా సెటిల్ అయిన ఓ తెలుగు కుర్రాడు ఆకాష్. భూమి పనిచేస్తున్న కంపెనీ బిల్డింగ్ కోసం ప్లాన్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ పుడుతుంది. ఇక వాళ్ల ప్రేమకథ కంచికి చేరుతుందనగానే కథలో ఓ మలుపు. ఆకాష్‌కి, భూమికీ మధ్య అంతకుముందు కాలేజీలో జరిగిన సంఘటనలు తెరపైకొస్తాయి. ఇంతకీ వాళ్లిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? అప్పుడు ఏం జరిగింది? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నాగశౌర్య , రీతూవర్మ అందంగా కనిపిస్తూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పలికించిన భావోద్వేగాలు కూడా ఎంతో పరిణతితో కూడుకుని ఉంటాయి. విరామానికి ముందు, క్లైమాక్స్‌కు ముందు సన్నివేశాల్లో ఆ ఇద్దరి నటన హత్తుకుంటుంది. పాటల్లోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలరించింది. సప్తగిరి, వెన్నెల కిశోర్, హిమజ, ప్రవీణ్ తదితరులు నవ్వించే బాధ్యతని తీసుకున్నారు. సప్తగిరి కామెడీ కడుపుబ్బా నవ్వించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకురాలు లక్ష్మీసౌజన్యకి ఇదే తొలి చిత్రమైనా ఎంతో పరిణతితో సన్నివేశాల్ని తెరపైకి తీసుకొచ్చారు.
బలాలు
నాగశౌర్య, రీతూ జోడీ, ద్వితీయార్థంలో కామెడీ, పాటలు
బలహీనతలు
సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలు, ఊహకు తగ్గట్టుగా కథ
మూవీ రివ్యూ: 2.75/5