తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన అలనాటి ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి(Krishnaveni) (102) కన్నుమూశారు. వయోభార సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప గొప్ప కళాకారులను పరిచయం చేసి గౌరవప్రదమైన నిర్మాతగా ఆమె మంచి గుర్తింపు అందుకున్నారు. ‘మనదేశం(Mana Desam)’ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్(NTR)ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు. అంతేకాకుండా లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత కృష్ణవేణిదే.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్య వృత్తి నిర్వర్తించేవారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించారు. 1936లో విడుదలైన ‘సతీ అనసూయ’తో ఆమె బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. తన పాటలను తానే పాడుకున్న నట గాయనిగా కూడా ఆమె పేరు సంపాదించారు. 1940లో మీర్జాపురం రాజాతో ఆమెకు వివాహం జరిగింది. వివాహానంతరం ‘భోజ కాళిదాసు’లో కృష్ణవేణి నటించారు. ‘మన దేశం’తో నటుడిగా ఎన్టీఆర్‌ను కృష్ణవేణి పరిచయం చేశారు.
1947లో విడుదలైన ‘గొల్లభామ’తో గుర్తింపు తెచ్చుకున్నారు. 1942లో కుమార్తె రాజ్యలక్ష్మీ అనూరాధకు కృష్ణవేణి(Krishnaveni) జన్మనిచ్చారు. తల్లి కృష్ణవేణి బాటలో నిర్మాతగా అనూరాధాదేవి రాణించారు. ‘కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నేపథ్యగానం అందించారు. ఘంటసాల, రమేశ్ నాయుడును సంగీత దర్శకులుగా కృష్ణవేణి పరిచయం చేశారు. గాయనీమణులు పి. లీల, జిక్కీలను కృష్ణవేణినే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. త్రిపురనేని గోపీచంద్‌ను కూడా సినీ రచయితగా కృష్ణవేణి మార్చారు. 1952లో వచ్చిన ‘సాహసం’ సినిమాలో ఆమె చివరిగా నటించారు. 1957లో చివరిగా ‘దాంపత్యం’ చిత్రం నిర్మించారు. కృష్ణవేణి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఇటీవల ‘మనదేశం’ వజ్రోత్సవ వేడుకలో కృష్ణవేణి పాల్గొన్నారు.