Movie: భారత చిత్రసీమలో స్మార్టెస్ట్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరని తమిళ హీరో శివకార్తికేయన్ అన్నారు. ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండను శివకార్తికేయన్ పొగడ్తలతో ముంచెత్తేశారు. గీతాగోవిందం సినిమా ఎన్నోసార్లు చూశాననీ.. అందులో విజయ్ ఎంతో స్వీట్‌గా కనిపించారని శివకార్తికేయన్ అన్నారు. నిజ జీవితంలో అతను అంతకన్నా స్వీట్ పర్సన్ అంటూ కితాబునిచ్చారు. తన కెరీర్ చాలా స్లోగా మెరుగవుతూ.. ఓ రైలులో వస్తే.. విజయ్ దేవరకొండ కెరీర్ మాత్రం రాకెట్‌లా ఉందన్నారు. చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారని కొనియాడారు. ఇది మామూలు విషయం కాదనీ, నిజంగా విజయ్ జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఇద్దరం కలిసి మల్టీ స్టారర్ సినిమా (Movie)చేద్దామని శివకార్తికేయన్ కోరగా.. విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది త్వరలోనే సాధ్యం అయ్యే అవకాశం ఉందనీ.. వేదిక మీదే డైరెక్టర్ హరీశ్ శంకర్ ఉన్నారు కాబట్టి.. ఆయన తలుచుకుంటే పక్కాగా, విజయ్, తన కాంబోలో మల్టీస్టారర్ ఉంటుందని శివకార్తికేయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు రెడీ అంటే నేను చేయటానికి సిద్ధమే అంటూ హరీశ్ శంకర్ కూడా పచ్చజెండా ఊపటంతో, ఇద్దరి హీరోల అభిమానుల్లో ఆనందానికి అవధులు లేవు.