మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా’ లో మేమంతా ఒకే తల్లి బిడ్డలం. కళామతల్లి బిడ్డల్లో ఐక్యత లోపించింది. టీవీలకు వెళ్లి మనుషులను రెచ్చగొట్టొద్దు. ఎన్నికల అధికారి పక్షపాతం లేకుండా వ్యవహరించారు. ‘మా’ రాజకీయ వేదిక కాదు, కళాకారుల వేదిక. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. సినీ పరిశ్రమలో గెలుపు ఓటములు సహజం. ‘మా’ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని గౌరవించాలి. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలుస్తాం. విష్ణు మొదట సీఎం కేసీఆర్‌ను కలవాలి. కేసీఆర్ కళాకారులకు ఎంతో సహాయం చేస్తారు. నేను కూడా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుస్తాను” అని మోహన్‌బాబు చెప్పారు.
“ఇక్కడ విర్రవీగేవాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రతిభ తప్ప దయాదాక్షిణ్యాలు సినీ పరిశ్రమలో ఉండవు. ఎవరికీ భయపడకుండా విష్ణుకు ఓటేశారు. నాకు ఎవరి మీద పగ, ద్వేషం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సినీ పరిశ్రమలో తప్పుబడతారు. ఓటు వేసిన సభ్యులే మాకు దేవుళ్లు. ఓటు వేయని వారిపై కక్షలు, పగలు వద్దు” అని మోహన్‌బాబు అన్నారు.