ఈనెల 28న ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి(New Parliament) మొత్తం 15 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం), వైసీపీ, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, బీజూ జనతాదళ్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం కాంత్రికారీ మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి, అప్నా దళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ్ మానిల కాంగ్రెస్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, మీజో నేషనల్ ఫ్రంట్ పార్టీలు హాజరవుతాయి. వీటిలో అధికశాతం ఎన్డీఏ కూటమిలోని పార్టీలే ఉన్నాయి.
కాగా పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని(New Parliament) బహిష్కరిస్తున్నట్టు 19 ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులు ప్రధాని మోదీ నూతన భవనం ప్రారంభిస్తున్నందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ చర్యను బీజేపీ ఖండిస్తూ పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రతిపక్షాలకు గౌరవం లేదని వ్యాఖ్యానించింది.
మరోవైపు బీజేపీని బద్ధశత్రువుగా భావిస్తున్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏ నిర్ణయం తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయస్థాయిలో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్.. విపక్షాల నిర్ణయానికి ఇంకా మద్దతు ఇవ్వకపోవడం వ్యూహాత్మక రాజకీయమే అని భావిస్తున్నారు. ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు మాత్రమే తమ అధినేత స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.