Avaniyapuram Jallikattu: ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో తమిళనాడులో జరిగే జల్లికట్టు పోటీలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో కోడిపందాలు ఎలాగో తమిళనాడులో జల్లికట్టు అంతే ఫేమస్. అయితే జల్లికట్టు చాలా సాహసోపేతమైన క్రీడ. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఆట నిబంధనలు అలాంటివి మరి. జల్లికట్టు ఆటలో పాల్గొనేవారు రంకెలేస్తూ దూసుకొస్తున్న ఎద్దును ఎక్కువసేపు నియంత్రించాలి. ఈ క్రమంలోనే ప్రాణాలు కూడా కోల్పోతారు. ఒకప్పుడు మన దేశంలో చాలా చోట్ల ఈ జల్లికట్టు పందేలు నిర్వహించేవారు. జల్లికట్టు క్రీడ పేరుతో జంతువులను హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు కోర్టులను ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆంక్షలు విధించింది. ఈ ఏడాది తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన మూడు గ్రామాల్లో మాత్రమే అధికారికంగా జల్లికట్టు ఆడడానికి న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది.
ఈ ఏడాది పొంగల్ సందర్భంగా ఆదివారం జల్లికట్టు క్రీడలు మూడు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. వీటిని తిలకించేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. కాగా అవనీయాపురం జల్లికట్టు(Avaniyapuram Jallikattu) కార్యక్రమంలో 60 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది తీవ్ర గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిని రాజాజీ ఆసుపత్రికి తరలించినట్లు మధురై జిల్లా కలెక్టర్ అనీష్ శేఖర్ తెలిపారు. స్వల్పంగా గాయపడ్డ 40 మందికి అక్కడే ప్రాథమిక చికిత్స అందించినట్లు ఆయన వెల్లడించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.