ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు కోర్టులో చుక్కెదురైంది. నేటితో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపర్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరోవైపు కేజ్రీవాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు.
“ఈ కేసు గత రెండేళ్లుగా కొనసాగుతోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఎలాంటి ఆధారాలు చూపించకుండానే అరెస్ట్ చేశారు. నేను(Arvind Kejriwal) ముఖ్యమంత్రిని కాబట్టి నా వద్దకు ఎంతోమంది వస్తుంటారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia) నా ఇంటికి వచ్చారు. నాతో మాట్లాడి ఏవో పత్రాలు ఇచ్చారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన ఫ్యామిలీ ట్రస్ట్ స్థాపన కోసం నన్ను కలవడానికి వచ్చారు. అనంతరం నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రాఘవ స్టేట్‌మెంట్ ఇవ్వగానే బెయిల్ వచ్చింది. సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి ఈ ప్రకటనలు సరిపోతాయా? అసలు ఈ కేసులో రూ.100 కోట్లు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏప్రిల్ 1వరకు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.