Air India nears historic order for up to 500 jets: టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో విమానాలను కొనేందుకు సిద్ధమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీలకు చెందిన 500 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేయనుంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఆర్డర్లలో 400 నారో బాడీ జెట్‌లు, 100 లేదా అంతకంటే ఎక్కువ వైడ్ బాడీ జెట్‌లు ఉన్నాయి.
వీటిలో కొన్ని ఎయిర్‌బస్ A350, బోయింగ్ 787, బోయింగ్777 విమానాలున్నాయి. త్వరలోనే ఈ భారీ ఒప్పందానికి తుది మెరుగులు దిద్దే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి స్పందించేందుకు ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలు నిరాకరించగా, ఎయిర్ఇండియా(Air India) ఇంకా స్పందించలేదు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమలో డిమాండ్‌కు తగిన స్థాయిలో విమానాలను విస్తరించాలని ఎయిర్ఇండియా భావిస్తోందని, ఆర్డర్ చేయబోయే 500 జెట్ లు వచ్చే పదేళ్ల కాలంలో డెలివరీలు అందుకోనున్నట్టు ఓ నివేదిక పేర్కొంది.