కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). దీనిపై తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).. ఘాటుగా స్పందించారు. సీఎం యోగి మాటలను తీవ్రంగా ఖండించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని ప్రశ్నించారు. సీఎం మాటలు దేశ గౌరవాన్ని విస్మరించే ప్రతికూల మనస్తత్వాన్ని తెలుపుతున్నాయన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
‘కొంతమంది మహాకుంభమేళా(Maha Kumbh Mela) ను రాజకీయ అవకాశవాదంగా మలుచుకున్నారు. స్వీయ ప్రచారాలకు మాధ్యమంగా వినియోగిస్తున్నారు. వారు తమ నైతికతను మరిచి ప్రసంగాలు చేస్తున్నారు. మహాకుంభ వంటి పవిత్రమైన దానిగురించి మాట్లాడేటప్పుడు సరైన పదాలు వినియోగించాలి. అవి వ్యక్తి ప్రతిష్టను నిలబెడతాయి. కానీ, వారి మాటలు అదుపుతప్పాయి. ఇది వారి ప్రతికూల మనస్తత్వానికి నిదర్శనం’ అని ఆయన(Akhilesh Yadav) రాసుకొచ్చారు.