Army truck Accident in Sikkim: ఇండియన్ ఆర్మీలో పెను విషాదం చోటుచేసుకుంది. సిక్కింలో జవాన్లతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో 16మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 13 మంది సైనికులు కాగా, ముగ్గురు ఆర్మీ అధికారులని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఛటెన్ నుంచి తాంగు వైపు వెళ్తున్న మూడు వాహానాలతో కూడిన కాన్వాయ్‌లో ఓ వాహానం మూలమలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. జెమా వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.
వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడిన నలుగురు సైనికులను వాయు మార్గంలో మెరుగైన చికిత్సకు తరలించారు. పెద్ద ఎత్తున సిబ్బంది మరణించడంపై ఇండియన్ ఆర్మీ విచారం వ్యక్తం చేస్తోంది. సైనికుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. మరోపైపు ప్రమాదంపై కేంద్రరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రోడ్డు ప్రమాదంలో ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన వార్త తీవ్రంగా కలిచివేసింది. ‘వారి సేవలకు, నిబద్ధతకు దేశం తరుఫున కృతజ్ఞతలు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.