ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అసోం(Assam) ప్రభుత్వం. కొత్త ఆధార్ కార్డుల జారీ కోసం కొత్త రూల్ తీసుకొచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ఇకపై కొత్త ఆధార్ కార్డు జారీ చేయాలంటే జాతీయ పౌర నమోదు(NRC) దరఖాస్తు నెంబర్ సమర్పించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త నియమం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా చెప్పారాయన. ఈ కొత్త రూల్‌కు సంబంధించి పూర్తి మార్గదర్శకాలను అతి త్వరలోనే విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
‘‘రాష్ట్రంలోకి తరలివస్తున్న అక్రమ వలసలను అరికట్టాలని నిర్ణయించుకున్నాం. అందుకోసమే ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా ఉండాలని నిశ్చయించుకున్నాం. అందులో భాగంగానే ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాం. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అధిక సంఖ్యలో అనుమానిత వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే ఎన్‌ఆర్‌సీ దరఖాస్తుకు సంబంధించి రసీదు నెంబర్‌ను సమర్పిస్తేనే కొత్త ఆధార్ కార్డును జారీ చేయాలని నిశ్చయించుకున్నాం. ఇకపై అసోం(Assam)లో ఆధార్ కార్డు జారీ చాలా కఠినంగా ఉండనుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్దతిని అవలంభించాలని కోరుతున్నా. అప్పుడు దేశంలోకి జరుగుతున్న చొరబాట్లను నియంత్రించగలుగుతాం’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.