ఎట్టకేలకు రాజస్థాన్(Rajasthan) సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారు అనే ఉత్కంఠకు తెరపడింది. భజన్ లాల్ శర్మ(Bhajan Lal Sharma)ను సీఎంగా ఖరారు చేస్తూ పార్టీ పెద్దలు అధికారిక ప్రకటన చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతను రాజస్థాన్ సీఎం చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే మూడు రాష్ట్రాల్లో కూడా కొత్తవారికే ఛాన్స్ ఇచ్చింది కమలం పార్టీ. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పాతవారిని పక్కనపెట్టి కొత్తవారిని ముఖ్యమంత్రులను చేసింది బీజేపీ.
Rajasthan | కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపికపై కసరత్తు నిర్వహించారు. మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో భజన్ లాల్ శర్మను శాసనసభాపక్ష నేతగా బీజేపీ ఎమ్మేల్యేలు ఎన్నుకున్నారు. భేటీ ముగిసిన అనంతరం భజన్ లాల్ శర్మ పేరును అధికారికంగా ప్రకటించారు. భజన్ లాల్ నాలుగు పర్యాయాలు రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే విశేషమేమిటంటే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. కాగా, సీఎం రేసులో పోటీపడిన ప్రిన్సెస్ దియా కుమారి(Diya Kumari)కి, ప్రేమ్ చంద్ భైర్వ(Prem Chand Bairwa) లకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టింది అధిష్టానం.