చైనాలో సంభవించిన యాగీ తుఫాను(Typhoon Yagi) పలు దేశాల్లో నానా యాగి చేస్తోంది. వియత్నాం సహా మయన్మార్, లావోస్ దేశాల్లో భీభత్సం సృష్టిస్తోంది. అత్యంత శక్తివంతమైన తుఫాన్ యాగి కారణంగా మయన్మార్‌ను వరదలతో అతలాకుతలం సృష్టిస్తోంది. ఈ వరదల వల్ల మయన్మార్‌లో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లావోస్‌ను కూడా యాగి తుఫాను వణికించేస్తోంది. కాగా యాగి తుఫానుతో అతలాకుతలం అవుతున్న మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలకు సహాయం చేయడానికి భారత్ ముందుకొచ్చింది. ఆ దేశాల్లో అస్తవ్యస్తంగా మారిన ప్రజలకు తాము అండగా ఉంటామని తెప్పింది. వారికి సహాయం అందించడానికే ‘సద్భవ్’ పేరిట సహాయక ఆపరేషన్‌ను చేపట్టింది.
ఈ ఆపరేషన్ కింద యాగి తుఫాను(Typhoon Yagi) ప్రభావిత మూడు దేశాలకు సహాయక సామాగ్రిని సరఫరా చేస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) ప్రకటించారు. ఈ మిషన్‌లో భాగంగానే భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురా ద్వారా 10 టన్నుల సహాయక సామాగరిని మయన్మార్‌కు పంపింది. ఈ సామాగ్రిలో ఔషధాలు, దుస్తులు, నిత్యావసరాలు ఉన్నాయి. ఇదే విధంగా వియత్నాంకు 35 టన్నులు, లావోస్‌కు 10 టన్నుల సహాయక సామాగ్రిని భారత్ అందించిందని ఆయన వెల్లడించారు. ‘‘యాగి తుఫానుతో అతలాకుతలమవుతున్న వియత్నాం(Vietnam), మయన్మార్(Myanmar), లావోస్(Laos) దేశాల్లో నష్టపోయిన ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నా. వారికి సహాయం చేయడం కోసం భారత్ ‘సద్భవ్’ ఆపరేషన్‌ను(Operation Sadbhav) చేపట్టింది. భారత్ అందిస్తున్న సహాయంలో తాగునీరు, దుప్పట్లు, వంట పాత్రలు, సోలార్ లాంతర్, దోమ తెరలు సహా మరిన్ని వస్తులు ఉన్నాయి’’ అని ఆయన తెలిపారు.